Komaram Bheem Story Telugu
కొమరం భీమ్ చరిత్ర
కొమరం భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు ఆదివాసీల కుటుంబంలో జన్మించాడు. ఆదివాసుల్లో జల్ జమీన్ జంగల్ అంటూ ఉద్యమ జ్వాల రగిలించిన విప్లవ యోధుడు. అడవుల్లో నివసిస్తున్న గిరిజనులపైన పెత్తం దారుల ఆధిపత్యాన్ని అడ్డుకున్న ఉద్యమకారుడు. స్వతంత్ర గోండు రాజ్యం కోసం పోరాడిన వ్యక్తి కొమరం భీమ్.
కొమరం భీమ్ జననం
కొమరం భీమ్ తెలంగాణ రాష్ట్రం లోని, ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండలంలో సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో అక్టోబర్ 22 న కొమరం చిన్నూ – సోంబారు దంపతులకు జన్మించాడు.
కొమరం భీమ్ ఉద్యమ జీవితం
కొమరం భీమ్ 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అటవీశాఖ అధికారులు జరిపిన దాడుల్లో ఇతని తండ్రి కొమరం చిన్నూ మరణించారు. తండ్రి మరణించడంతో కొమరం భీమ్ కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్ అనే ప్రాంతానికి వలస వెళ్లిపోయారు. ఆ ప్రాంతంలో భీమ్ కుటుంబం సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని హతమార్చి అస్సాం వెళ్లిపోయాడు. అక్కడ 5 సంవత్సరాల పాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్ తిరిగి సర్దాపూర్ చేరుకున్నాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్క తాటిపై నడిపించి ఉద్యమించాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు, జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబు పై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. భీమ్ కు కుడిభుజంగా కొమురం సూరు కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు. వెడ్మరాము కూడా బీవీహీమ్ కు సహచరుడిగా ఉన్నాడు. వీరిద్దరూ కూడా అప్పటి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన నాయకులు.
కొండ కోనల్లో , ప్రకృతితో సహజీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవి పై హక్కు సామజిక న్యాయంలో భాగమని నినదిస్తూ, 1928 నుంచి 1940 వరకు రణభేరి మోగించిన కొమరం భీమ్ నైజాం సర్కారు గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాట యోధుడు.
కొమరం భీమ్ వీర మరణం
కుర్దు పటేల్ అనే నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 అక్టోబర్ 27 న జోడేఘాట్ అడవుల్లోని కొమరం భీం స్థావరాన్ని ముట్టడించి భీమ్ ను హతమార్చియి. నిజాం సైన్యం మీద, అటవీ సిబ్బంది పైనా కొమరం కొదమ సింహంలా గర్జించాడు. కుర్దు పటేల్ అనే నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారంతో, అర్ధరాత్రి కొమరం స్థావరాలను సైన్యం చుట్టుముట్టి గోడెఘాట్ అడవుల్లో, ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ సుద్ద పౌర్ణమి రోజున కొమరం భీమ్ వీరమరణం పొందాడు. అప్పటి నుండి ఆ తిథి రోజునే కొమరం భీమ్ వర్థంతి జరుపుకోవడం ఆదివాసీల ఆనవాయితీగా కొనసాగుతోంది.
Komaram Bheem గురించి మరికొన్ని ముఖ్య విషయాలు
- కొమరం భీమ్ తేయాకు తోటల్లో పనిచేసేటప్పుడు చదవడం, రాయడం అక్కడే నేర్చుకున్నాడు.
- భీమ్ మరాఠి , ఉర్దూ భాషలను కూడా అక్కడే నేర్చుకోవటం జరిగింది. అక్కడే కొత్త పంటలను పండించడం, వాటిని మార్కెట్లో మంచి ధరకు అమ్మడం నేర్చుకున్నాడు.
- గిరిజన ప్రాంతప్రజలకి భీమ్ నాయకుడయిన తరువాత 60 ఎకరాల అడవిని చదును చేసి 12 గ్రామాలను ఏర్పాటు చేసాడు.